హనుమకొండ: లోక్ సభ ఎన్నికలు హనుమకొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుండే ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.  పరకాల నియోజకవర్గం పరిధిలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,22,383 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 244 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,83,446 మంది ఓటర్లు ఉన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలో 1,70,925 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 76.86గా నమోదయింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 1,49,294మంది ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ శాతం 52.67గా నమోదైంది. హనుమకొండ జిల్లాలో 64.76 పోలింగ్ శాతం నమోదయింది. 

 ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్

 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం నిర్వహించిన పోలింగ్ లో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్

 హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన పరకాల వరంగల్ పశ్చిమ లోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని జిల్లా అధికారులతో పాటు అదనపు కలెక్టర్లు  రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి లతో కలిసి హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేయగా జిల్లా ఎన్నికల అధికారి  ఈ ప్రక్రియను పరిశీలించారు. 

 ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు

 లోక్ సభ  ఎన్నికల నేపథ్యంలో  హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లను ఆకట్టుకునేలా  మోడల్ పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దారు. ఓటేసేందుకు  పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు మోడల్ పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post