సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం

*
సంగీతానికి, పాటకు ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు
*
‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు
భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారతీయ 14 భాషల్లో… 40వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియాడారు. తరాలు మారినా, ఆయన పాట నిత్యనూతనంగా ప్రతీ తెలుగు హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుందన్నారు. ‘ది మ్యూజిక్ గ్రూప్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడితో కలిసి సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సంగీత ప్రపంచంలో రారాజుగా… పాటల పల్లకిలో నెలరాజుగా… అమర గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. కేవలం గాయకుడిగా మాత్రమే కాదు… నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మనల్ని అలరించారన్నారు. తెరపై కనిపించే నటులే పాడుతున్నారా అని అనిపించేలా పాడటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. ఆయన గొంతులో పలికిన ప్రతి పాటలో ఒక భావం, ఒక జీవం ఉండేదన్నారు. నూతన కళాకారులను ప్రోత్సహించడంలో, కొత్త సంగీత పోకడలను స్వాగతించడంలో ఎప్పుడూ ముందుండేవారన్నారు. ఈ రోజు మనం ప్రారంభించుకున్నది కేవలం విగ్రహం మాత్రమే కాదని, అది సంగీతానికి, నిబద్ధతకు, వినయానికి ప్రతీక అన్నారు. అపారమైన సంగీత సంపదను, ఆయన పాటించిన ఉన్నతమైన విలువలను అది మనకు నిరంతరం గుర్తు చేస్తుందన్నారు. కళలను ప్రోత్సహించేందుకు, కళాకారులను గౌరవించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు, డా.కేఐ వరప్రసాద రెడ్డి, ఎస్పీ చరణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
